ఒకప్పుడు కృష్ణను ఇండియన్ కౌబాయ్‌గా చూపించి మెప్పించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ వంటి ఘనమైన టైటిల్‌తో రావడం, అందులోనూ హీరో కృష్ణకు స్వయానా అల్లుడు కావడం, పైగా ఇది ‘స్వామి రారా’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన బేనర్ సినిమా కావడం వల్ల కలిగిన ఆసక్తి, సినిమా చూస్తున్నంత సేపూ నీరుకారి పోయింది. ప్రేక్షకుల అంచనాలను తృప్తిపరిచే ఆకర్షణలేవీ ఈ సినిమాలో లేవు. సుధీర్‌బాబు, జయప్రకాశ్‌రెడ్డి, చంద్రమోహన్ వంటివాళ్లు బాగా నటించి ఉండవచ్చు. కానీ మంచి నటన రాణించేందుకు తగిన పాత్రలు కానీ, సన్నివేశాలు కానీ, కథ కానీ ఇందులో లేవు.
‘స్వామి రారా’ సాధించిన విజయంతో క్రైమ్ కామెడీ తీస్తే హిట్టే అనే నమ్మకం తెలుగు సినిమా ఇండసీ్ట్రలో బలపడినట్లు అనిపిస్తుంది. కానీ అది కేవలం నమ్మకమే కానీ, వాస్తవం కాదని నిన్నటికి నిన్న ఇదే ధోరణిలో వచ్చిన ‘దోచేయ్’ రుజువు చేస్తే, తాజాగా ఆ బాధ్యతను ‘మోసగాళ్లకు మోసగాడు’ తీసుకున్నాడు. బలమైన సన్నివేశాల కల్పన, బిగువైన స్ర్కీన్‌ప్లే, ఆహ్లాదపరిచే కామెడీ వల్లే క్రైమ్ కామెడీలు ప్రేక్షకుల్ని రంజింపజేస్తాయి. ‘మోసగాళ్లకు మోసగాడు’లో కొన్ని ఆహ్లాదపరిచే కామెడీ సన్నివేశాలున్నాయి కానీ కథాగమనంలో అవి తేలిపోయాయి. మనసుని స్పందింపజేసే ఒక్క బలమైన సన్నివేశమూ లేకపోవడం, స్ర్కీన్‌ప్లే గజిబిజిగా నడవడం వల్ల ఈ సినిమా ఆద్యంతమూ విసుగునీ, చికాకునీ కలిగిస్తుంది. ఫస్టాఫ్ బోరింగ్‌గా ఉందనుకుంటే, సెకండాఫ్ దానికి జేజమ్మలా తలబొప్పి కట్టిస్తుంది.
‘మోసగాళ్లకు మోసగాడు’ ఓ అవాస్తవిక కథ చుట్టూ నడిచే సినిమా. ‘స్వామి రారా’ కథ వినాయక విగ్రహం చుట్టూ నడిస్తే, ఈ సినిమా కథ అయోధ్యకు 12 కి.మీ. దూరంలోని గుడి నుంచి దొంగతనానికి గురైన సీతారాముల విగ్రహాల చుట్టూ నడుస్తుంది. క్రిష్ (సుధీర్‌బాబు) అనే ఓ చిల్లర దొంగ, లింగంపల్లిలోని ప్రభుత్వ గ్రంథాలయంలో లైబ్రేరియన్‌గా పనిచేసే జానకి (నందిని) అనే అమ్మాయిని తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. ఆమె వెంటపడతాడు. పెళ్లి కోసం మేరేజి బ్యూరోని సంప్రదించిన జానకి, మొదట క్రిష్ అంటే ఇష్టపడదు. కానీ ఓ ‘పాట’తో అతడి ప్రేమను ఒప్పేసుకుంటుంది. అతడు దొంగనీ, మోసగాళ్లకు మోసగాడనీ తెలిశాక, ఆ పాడుపనిని వదిలేయమంటుంది కానీ అతణ్ణి మాత్రం వదిలేయలేకపోతుంది, గొప్ప ప్రేమికురాలికి మల్లే. అయోధ్య నుంచి ఎంతో నాటకీయంగా, ‘ఔరా! విగ్రహాలను దొంగలించుట ఇంత సునాయాసమా!’ అనేట్లు.. పళ్లెంలోని సీతారాముల విగ్రహాల్ని పూజారి నీళ్లలో ముంచి తీసేలోపలే, ఆ విగ్రహాల్ని మాయం చేసి, వాటి స్థానంలో నకిలీ విగ్రహాలు ఉంచి ఉడాయించిన ఇద్దరు దొంగలు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో చెరో విగ్రహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుంటారు. ఒక దొంగ తప్పించుకుని దుబాయ్‌లోని తమ యజమాని రుద్ర (అభిమన్యు సింగ్) వద్దకు వెళ్తే, ఇంకో దొంగ పోలీసులకు దొరికిపోయి చచ్చిపోతాడు. కానీ ఈలోగా అతడి దగ్గరున్న రామ విగ్రహాన్ని క్రిష్ చేజిక్కించుకుంటాడు. విగ్రహాల విలువను అంచనాకట్టే అతని వద్దకు తీసుకుపోతే, అది అమూల్యమైన నవరత్న లోహాలతో చేసినదనీ, అయితే సీత విగ్రహం తోడుగా ఉంటేనే దానికి విలువనీ, లేకపోతే దానికి విలువలేదనీ చెబుతాడు. దాంతో మైండ్ గేమ్ మొదలుపెడతాడు క్రిష్. అదివరకే ఆ విగ్రహాలను స్మగ్లింగ్ చేయడానికి రూ. 25 కోట్లకు డీల్ కుదుర్చుకున్న రుద్ర హైదరాబాద్ వస్తాడు, రామ విగ్రహం కోసం. ఆ విగ్రహాన్ని జానకి ద్వారా రుద్ర వద్దకు చేర్చి, తనూ అతడివద్దకు వెళతాడు క్రిష్. ఆ విగ్రహాల కోసం రుద్రతో డీల్ మాట్లాడుకున్న వాళ్లు కూడా రూ. 25 కోట్లతో హైదరాబాద్ వస్తారు. విగ్రహాలు పోలీసుల చేతికీ, డబ్బు తన చేతికీ వచ్చేలా క్రిష్ ఏం చేశాడనేది క్లైమాక్స్.
ఈ మధ్య కాలంలో ఎన్నో సినిమాల్లో మనం ‘టామ్ అండ్ జెర్రీ’ ఆటలు చూశాం. ఇందులోనూ సేమ్‌థింగ్ రిపీట్. విలన్ దగ్గరే ఉంటూ, అతడికి అనుయాయిగా నటిస్తూ, ఆఖరుకి అతణ్ణి ‘ఉత్త వెధవాయి’గా హీరో తేల్చేసే సీన్లు ఎన్ని సినిమాల్లో మనం చూడలేదు! ఈ సినిమాలో సెకండాఫ్ అంతా ఈ తరహాలోనే నడిచి, ‘ప్చ్.. ఇది కూడా ఇదే బాపతా’ అనే చిరాకుని కలిగిస్తుంది. మోసాలతోటే రోజులు గడిపే క్రిష్ చివరకు తను మోసంతో కొట్టేసిన డబ్బును ‘శ్రీరామ విద్యాలయము’ పరాధీనం కాకుండా చేయ్యడానికి వెచ్చించడమనేది ఎంత అస్వాభావికంగా ఉందో! నీతినే నమ్ముకున్న మాస్టారు (చంద్రమోహన్) తనను ఎవరు ఎన్ని ప్రలోభాలకు లోను చెయ్యాలని చూసినా, విద్యాలయాన్ని అమ్ముకోడు. చివరకు అప్పులపాలై బ్యాంక్‌వాళ్లు స్కూలును వేలం వేస్తున్నా బేలగా బాధపడుతూ ఉండిపోతాడు. అటువంటివాణ్ణి కూడా తను మోసంతో సంపాదించిన సొమ్ముతో స్కూలు పరాధీనం కాకుండా చూసి, మోసం చేశాడు క్రిష్. ఎవరో ఓ యువకుడు (మంచు మనోజ్ - స్పెషల్ అప్పీరెన్స్) వచ్చి ‘మాస్టారూ నేను చిన్నప్పుడు మీ దగ్గర చదువుకున్నవాణ్ణి. ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి’ అంటూ డబ్బున్న బ్యాగ్ ఇచ్చి వెళ్లిపోతే, అది క్రిష్ చేసిన ఏర్పాటని తెలీక నిజమే అని నమ్ముతాడు మాస్టారు. ఆ రకంగా మాస్టారు పాత్ర ఔన్నత్యాన్నీ, క్రిష్ పాత్ర ఔచిత్యాన్నీ దెబ్బతీశాడు దర్శకుడు. పైగా మాస్టారును అతడు ఎందుకు ఆదుకున్నాడో జానకికి క్రిష్ చెప్పిన కథ ప్రధాన కథకు అతకలేదు. అతను బాగా చిన్నవాడిగా ఉన్నప్పుడు మాస్టారు పర్సును దొంగిలిస్తాడు. కానీ అక్కడే యాక్సిడెంట్‌కు గురవుతాడు. మాస్టారే అతణ్ణి ఆస్పత్రిలో చేర్చి బతికిస్తాడు. కానీ తన పర్సు దొంగిలించింది క్రిష్ అని మాస్టారుకు తెలీదు. చిన్నప్పుడు అలా తనను కాపాడిన మాస్టారుకు ఇప్పుడు కృతజ్ఞత చూపించానని చెబుతాడు క్రిష్. ఇదెంత కృతకంగా ఉందో వేరే చెప్పాల్సిన పనిలేదు. నిజానికి తను పర్సు దొంగిలించిన వ్యక్తే తనకు ప్రాణదానం చేస్తే, అప్పుడే క్రిష్‌లో పరివర్తన కలిగి, మంచివాడిగా పెరిగి ఉండాల్సింది. పేదవాళ్లకు ఉచితంగా చదువు చెబుతున్న మాస్టారి వద్దే చదువుకుని ఉండాల్సింది. కానీ అలా చేయకుండా దొంగగానే పెరిగి, మాస్టారు మందలిస్తుంటే, దులుపుకుని పోతుంటాడు. అంటే చివరలో క్రిష్ చెప్పిన కథ అసహజంగా ఉందన్న మాటే.
క్రిష్ పాత్రను సాధ్యమైనంత వరకు బాగా చెయ్యడానికి ప్రయత్నించాడు సుధీర్‌బాబు. హావభావాల పరంగా, డైలాగ్ డిక్షన్ పరంగా మునుపటి సినిమాలతో పోలిస్తే మెరుగయ్యాడు. ఈ సినిమాకు హీరోయిన్ పెద్ద మైనస్. అందచందాల పరంగా కానీ, హావభావాల పరంగా కానీ నందిని ఏమాత్రం ఆకట్టుకోలేదు. క్రిష్‌ని ఓ వైపు ప్రేమిస్తూనే, మరోవైపు అతణ్ణి పోలీసులకు పట్టించాలని ప్రయత్నించడంతో ఆ పాత్రకూ ఓ వ్యక్తిత్వం అనేది లేకుండా పోయింది. ఈ సినిమాలో పోలీసుల ప్రవర్తన మనకు మింగుడుపడదు. ఓ కేసును దర్యాప్తు చేస్తూ, చేతికి చిక్కిన నేరగాళ్లను అరెస్ట్ చేయకుండా, వాళ్లు ప్రతిఘటించకపోయినా, ‘టపా టపా’ కాల్చుకుంటూ పోతుంటారు. తమంతట తామే సాక్ష్యాలను చెరిపేస్తూ వెళ్తుంటారు. కౌశిక్‌గా, అతని బావమరిదిగా జయప్రకాశ్‌రెడ్డి, దువ్వాసి మోహన్ నవ్వించే ప్రయత్నంలో కొంతమేర సఫలమయ్యారు. కానీ జయప్రకాశ్‌ను మరీ బఫూన్‌ని చేయడంతో, అతను విలనా, కమెడియన్నా అనే విషయంలో దర్శకుడికే ఓ క్లారిటీ లేనట్లు కనిపించింది. రుద్రగా అభిమన్యుసింగ్ సోసోగా ఉన్నాడు. మాస్టారు పాత్రకు చంద్రమోహన్ అతికినట్లు సరిపోయాడు. సినిమాకి నేపథ్య సంగీతం కాస్త బలాన్నిచ్చేవిధంగా ఉన్నా, పాటలు మాత్రం పూర్తిగా తేలిపోయాయి. ఒక్క పాటనూ ప్రేక్షకులు కుర్చీలో కుదురుగా కూర్చొని ఆస్వాదించలేరు. ఛాయాగ్రహణం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా ఆరంభంలో ఇచ్చిన బిల్డప్‌కు తగ్గట్లు చివరిదాకా ఉంటే బాగుండేది. ఇన్ని లోపాలుండటం వల్ల సహజంగానే ‘మోసగాళ్లకు మోసగాడు’ బాగా విసుగుపుట్టించాడు. నిర్మాతలు ఇకనైనా ఒకే తరహా చిత్రాలను కాకుండా, కథాబలం ఉన్న భిన్న తరహా సినిమాలు తీస్తే బాగుంటుందని సగటు ప్రేక్షకుడు అభిప్రాయపడుతున్నాడు.
ట్యాగ్‌లైన్ : జనం మోసపోరు
రేటింగ్: 1.75/5
No comments:
Post a Comment